మలయాండీని గుర్తు చేశావు అశేరా !

ప్రొఫెసర్. మలయాండీ అనే తమిళ ఆంథ్రోపాలజిస్ట్ కర్నూలు జిల్లా అడవుల్లో పరిశోధనలు చేస్తూ ఓ గుహలోకి వెళ్లినాడంట. ఆ గుహ గోడ పైన ఓచోట ‘చిత్రలిపి’ చూసి ఆసక్తితో రాసుకొచ్చి కొన్నేళ్లు ఆ చిత్రలిపిని చదవడం మీదనే సమయమంతా వెచ్చించి ఒక మంచిరోజున ‘యురేకా’ అని అరిచి అప్పుడు మద్రాసులో ఉంటున్న ఒకానొక ‘తెలుగు చరిత్రకారుడి’ దగ్గరకు పరిగెత్తి, అయ్యా మీ తెలుగుకు పూర్వ రూపం దొరికిందండి. భాషగా మీ తెలుగుకి ఎనిమిది వేల ఏళ్ల చరిత్ర ఉందని నా పరిశోధనలో తేలింది. నేను ఆ చిత్రలిపిని డీకోడ్ చేయగా ‘ఆన్ ది ర లో కం’ (ఆంధ్ర లోకం) అని వచ్చిందండీ అంటూ సంబరంగా చెప్పాడంట. మలయాండీని పిచ్చోడ్ని చూసినట్టు చూసిన ఆ తెలుగు చరిత్రకారుడు ఏమయ్యా, ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఓ భాష ఉంది అంటే ఎవరైనా నవ్వరా ? నీ పరిశోధన తప్పు ఇంక వెళ్లిపో అని సెలవిచ్చారంట. అప్పుడే మలేషియా తెలుగు మహాసభలు జరుగుతుండడంతో ఆశ చావని ప్రొఫెసర్. మలయాండీ ఆ దేశానికి వెళ్లి తన పరిశోధనా పత్రాలను మహాసభల పెద్దలకు అందించాడంట. వాళ్లు దాన్ని ప్రింట్ చేసి సభల్లో పంచితే మిశ్రమ స్పందనలు వచ్చాయంట !. అంతటితో ఆ కథ ముగిసింది. పాపం పెద్దాయన మలయాండీ తన పరిశోధన గుర్తింపు నోచకనే కన్ను మూసినాడు. (ఈ వివరాలన్నీ నడుస్తున్న చరిత్ర మాస పత్రికలో వచ్చాయి)

చరిత్ర గురించి, భాష గురించి, మన తెలుగువాళ్లకు ఎంతటి గౌరవమో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అడవాల శేషగిరన్న ‘కంబగిరి నుంచి శేషగిరి దాకా – ఓ చారిత్రక ప్రయాణం’ పేరిట రాసిన పుస్తకం అంతా చదివాక నాకు మలయాండీ విఫల ప్రయత్నాలు గుర్తొచ్చి గుండె బరువెక్కింది. మరొక ‘పిచ్చి మలయాండీ’ కావడం తప్ప రాయలసీమలోని కంబగిరి నుంచి శేషగిరి దాకా తిరిగి చూసి ఎండకీ వానకీ ఆకలి దప్పులకి ఓర్చి సంపాదించిన అనుభవజ్ఞానంతో ఈ పుస్తక రచన చేసిన శేషగిరన్న సాధించే ప్రయోజనం ఏముంటుంది ? ఇటువంటి ఎందరు ‘పిచ్చోళ్లు’ పని కట్టుకొని ఎంత చెప్పినా వినే రకం కాదు మన తెలుగు జాతి.

సీమ కొండ కోనల్లో ప్రమాదాలను కాచుకొంటూ తిరిగి పరిశ్రమతో, పరిశోధనతో ఆదిమానవుడి అడుగుజాడల నుంచి భౌగోళిక అద్భుతాల వరకూ రికార్డు చేసిన ఈ పుస్తకాన్నైనా కొని చదివి దాచి ఉంచండి. ఎందుకంటే ఆయా ప్రాంతాలన్నిట్నీ అభివృద్ధి భూతం ఒక్కొక్క అడుగుగా కాలరాస్తూ వస్తోంది.

మలయాండీ పరిశోధనా పత్రాలు ఏ గాలికి పోయినాయో !

ఇలా దొరికినవైనా భద్రం చేసుకుందాం.. ?

అశేరన్నకు, ముద్రించిన ‘ఎన్నెల పిట్ట’కు 💙

పుస్తకం కోసం :- 7989546568

Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart