“సూక్ష్మజీవి” కొత్త ఆశ

సమస్త జీవన రంగాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న పెట్టుబడి ఒకవైపు… జీవితంలోని వైవిద్యాన్ని వధ్యశిలపై నిలబెట్టిన మతమొకవైపూ… మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్తమానమిది. ప్రశ్నను, ప్రశ్నకు పురుడుపోసిన పురోగామి ఆలోచనూ పూడ్చిపెట్టాలనుకుంటున్న మూర్ఖత్వం రాజ్యమేలుతున్న కాలమిది. ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఒక నినాదం మాత్రమే.

ఇంతటి సంక్షోభ సమయాన మనిషిని ఒంటరి కాకుండా నిలబెట్టేది సమూహమే. ప్రశ్నను వెంటేసుకు తిరిగే సమూహమే. ఆ సమూహమే సమాజాన్ని చలనంలో ఉంచుతుంది. సమాజానికి దర్పణంలాంటిదే సాహిత్యం. అలాంటి సాహిత్యమే “సూక్ష్మజీవి”. కళ్లముందటి ప్రపంచాన్ని కవిత్వంలోకి ఒంపే ప్రయత్నం ఇది. చీకట్లు ఆవరిస్తున్నాయనే నిరాశామయ వాతావరణంలో భవిష్యత్తుపై ఆశను నిలబెట్టే ప్రయత్నం.

ఐదేళ్ల క్రితం బాలుని చూసినప్పుడు ఇలాంటి పరిణామక్రమాన్ని ఊహించనే లేదు. తనకు తెలియకుండానే సాహిత్యఆవరణలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. మూకస్వామ్యం వర్థిల్లుతున్న వర్తమానంలో… దేశం నరనరాల్లోకి ద్వేషం ఇంజెక్టవుతున్న కాలంలో కవిత్వాన్ని నిరసనగా ఎగరేయాలని బయల్దేరాడు. కవిత్వం ఓ సృజనాత్మక వ్యక్తీకరణ. స్వేచ్ఛను కాంక్షించే సమూహం వెంట నిలబడి… సృజనాత్మక ధిక్కారాన్ని ఆలింగనం చేసుకున్నాడు బాలు. కల్లోల కాలంలోని సంఘర్షణంతా తన అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

భిన్న అస్థిత్వాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన కాలంలో నిలబడి, కవి విధ్వంసాన్ని ప్రశ్నిస్తున్నాడు. మనిషి ఆలోచనను, ఆచరణను అదుపు చేయాలని చేస్తున్న మత ఆధిపత్యాన్ని, అంటరానితనపు వికృతరూపాన్ని నిలదీస్తున్నాడు. పురుషాధిపత్యపు చావు తెలిని, మనిషి మూలుగను పీల్చిపిప్పిచేస్తున్న పెట్టుబడి పొట్టవిప్పి చూపుతున్నాడు. మట్టితో మనిషికున్న బంధాన్ని గుర్తుచేస్తున్నాడు. ఈ అక్షరాల్లో మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రేమకోసం తపన కనిపిస్తుంది. ప్రకృతి వేదన కనిపిస్తుంది.

తనను తాను సూక్ష్మజీవిగా ప్రకటించుకున్న బాలు తొలి ప్రయత్నంలోనే తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడనే చెప్పాలి. తనదైన పదబంధాలను ప్రవేశపెట్టడంలోనే ఈ ప్రత్యేకత కనిపిస్తుంది. సైన్స్‌ విద్యార్థిగా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న బాలు… తన సృజనాత్మక వ్యక్తీకరణలోకి ఆ పదబంధాలను లాక్కొచ్చాడు. తొలి కవితా సంకలనంలోనే… అంటరానితనం నుంచి ఆకలి ఆకంద్రనల వరకు, ఆదివాసీ సమూహం నుంచి పాలస్తీనా పోరాటం వరకు ఇలా తను తడమని సబ్జెక్ట్‌ లేదంటే ఆశ్చర్యమేస్తుంది.

తొట్రుపాటులేకుండా పురోగామి సమాజంపై ప్రేమను ప్రకటించిన కవిత్వం ఇది. మత మూఢత్వంలో మనిషితనాన్ని కోల్పోతున్న వర్తమానంలో ఒక కొత్తతరం హేతువును వెతుక్కుంటూ నడకను మొదలుపెట్టడం గొప్ప ఆశ. అక్కడక్కడా ఇంకా కొంత దిద్దుబాటు అవసరం.

బాలు సాహిత్య ప్రయాణం మరింత ఆశాజనకంగా ఉండాలని కాంక్షిస్తూ…

Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart